మహంకాళి బోనాల్లో జోష్యం చెప్పే ‘దేవత ‘ కుడా ఒక మనిషే అని తెలుసా ..!

Facts about Rangam swarnatlatha :: దేవతంటూ మొక్కుతున్నరు సరే..
మరి స్వర్ణలత సంగతేమిటి తెలుసా..?
మహంకాళి బోనాల్లో రంగం ఎక్కి జోష్యం చెప్పే ‘దేవత ‘ కుడా ఒక
మనిషే అని తెలుసా ..! ఆ మనిషి పేరు స్వర్ణలత,
తుకారాంగేట్ కు చెందిన ఈవిడ ఇరుకు గల్లీలో ఒక చిన్న ఇంట్లో బతికే ఒక సామాన్య మహిళ స్వర్ణలత.
ఆమెను చిన్నతనంలోనే మాతంగిగా మార్చారు. మాతంగి అంటే “ఒక కత్తి తో పెండ్లి చేసి, ఇక ఆమెకు భర్త ,పిల్లలు అనే ఊసే ఉండకూడదు , ఆమె జీవితం కేవలం దేవునికి అంకితం అయ్యే విధంగా చేయడం అన్నమాట. ఇంకా లోతుగా చెప్పాలంటే, ఆచారం పేరుతో ఆమె జీవితాన్ని ఆమెకు కాకుండా చేయడం.. ఆ విషయాన్ని ఆమెతోనే అంగీకరింపచేయడం. ఈ ఒక్కరోజే ఆమె దేవత మిగతా 364 రోజులు రెక్కాడితే గాని డొక్కాడని కూలి బతుకు. విచిత్రం ఏంటంటే.. ఈ ఒక్క రోజు దేవత మిగతా 364 రోజులు దారుణమైన వివక్షను అనుభవిస్తూ ఉంటుంది.
మొన్న రంగం ఎక్కి జాతకం చెప్పటం పూర్తయ్యాక.. వేషం తీసేసిన స్వర్ణలత.. విలేఖరులతో తన గోడు వెల్లబోసుకున్నది.. “1997లో ముత్యాలమ్మ గుడిలో నాకు కత్తితో పెళ్లి జరిపించారు. నా జీవితం మహంకాళి అమ్మ సేవకే అంకితమైంది. మాతంగి అంటే ఎవరూ ఇల్లు ఇవ్వడానికి ముందుకు రారు. అతి కష్టం మీద ఒక చిన్న కిరాయి ఇంట్లో బతుకుతున్నాం.
ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప పూటగడవదు. రవికెలు, ఇతర దుస్తులు కుడతాను. నెలకు రూ.1500 కూడా రావు.” ఒకప్పుడు ఈ మాతంగి, జోగినులు, బసవినిలు విపరీతమైన లైంగిక దోపిడీకి గురయ్యేవారు. నిమ్నవర్గాల ఆడబిడ్డలను “దేవుడి భార్య” గా మార్చేసి.. సమాజంలోని కొందరు పెద్దలు తమ చీకటి అవసరాలను తీర్చుకునేవారు. హేమలత – లవణం దంపతుల కృషితో 1988 లో దేవదాసి, జోగిని, మాతంగి వ్యవస్థ లను రద్దు చేశారు.
నేడు అడుగడుగునా భూస్వామ్య సంస్కృతిని పెంచి పోషిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే పండుగలో మాతంగి వ్యవస్థ ను ఇలా కొనసాగించడం అక్రమం.. అన్యాయం.
*ఆధిపత్యవర్గాలు తమ కుత్సిత స్వార్ధంకోసం పుట్టించిన దురాచారాలను మన “తెలంగాణా సంస్కృతి” పేరుతో మనమెలా కొనసాగించగలం?