తొడల రాపిడి నుంచి బయటపడాలంటే..
ఎక్కువ చెమట పట్టడం.. నడుస్తూ పని చేయడం.. ఎక్కువ సమయం బిగుతు దుస్తులు ధరించి ఉండటం.. ఇలాంటి కారణాల వలన తొడల దగ్గర చర్మం రాసుకుపోయి, అక్కడి చర్మం ఒరిపిడికి గురై, కందిపోయి మంట రావడం జరుగుతుంది. ఈ సమస్య పురుషులలోనూ, మరీ ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది.
అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. అయితే చిన్నచిన్న టిప్స్‌ను పాటించడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు.

తొడల రాపిడి సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా మరీ బిగుతు దుస్తులు ధరించకుండా ఉండటం మేలు. దుస్తులు వేసుకునే ముందు టాల్కమ్ పౌడర్‌ను అప్లై చేసుకోవడం ద్వారా ఈ సమస్యను కొంత వరకు తగ్గించుకోవచ్చు.
రాత్రి పడుకునే ముందు తొడలకు కొబ్బరినూనెతో మసాజ్ చేసుకోవడం వలన కొంచెం ఉపశమనం పొందవచ్చు.
కొంచెం బేకింగ్ సోడాలో కొంచెం నీటిని కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను మంట ఎక్కువగా ఉన్నప్రదేశంలో అప్లై చేయండి. తరువాత చల్లని నీటితో కడిగేయడం ద్వారా చర్మం పొడిగా ఉంటుంది.
తేనె ఒక మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చర్మంపై ఇది రాత్రి పడుకునే ముందు అప్లై చేసినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చును.