కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..!
నేటి రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో తొడ కండరాలు పట్టేయడం.. అలాగే కొందరిలో కాలి పిక్కలు కూడా పట్టేస్తూ ఉంటాయి. సాధారణంగా నిద్రలో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే క్రింద కూర్చొని ఎక్కువసేపు పని చేసే వారిలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది.
పౌష్టికాహారలోపం, దీర్ఘాకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం, వ్యాయామాలు, ఆటలు ఆడేటపుడు ఎక్కువగా ఈ సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఈ చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమన పొందవచ్చు.

తొడ కండరాలు లేదా కాలి పిక్కలు పట్టేసినపుడు ఆ ప్రదేశంలో ఐస్‌గడ్డలు కలిగిన ప్యాక్‌ను కొంతసేపు ఆ ప్రదేశంలో ఉంచుకోవాలి. నొప్పి తగ్గేవరకూ ఇలా చేయాలి. దీంతో ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, ఆవనూనెను సమభాగాల్లో తీసుకుని గోరు వెచ్చగా చేసుకోవాలి. ఇలా వేడి చేసిన ఆయిల్ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో మృదువుగా రాస్తూ మర్దన చేసుకోవాలి. దీంతో బిగుసుకుపోయిన కండరాలు సాగుతాయి. నొప్పి కూడా తగ్గుతుది.
కొబ్బరి నూనె కొంత తీసుకుని అందులో కొన్ని లవంగాలను వేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని సన్నని సెగపై వేడి చేయాలి. దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు సమస్య ఉన్న ప్రాంతంలో మర్దన చేస్తూ అప్లై చేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
శరీరంలో తగినంత పొటాషియం లేకపోయినా ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వారు పొటాషియం ఎక్కువగా లభించే అరటిపండ్లు, టమాటో, సోయాబీన్స్, అవకాడో వంటి వాటిని తీసుకుంటే ఈ సమస్య రాకుండా ఉంటుంది.