shiva vaibhavam
కాళహస్తీశ్వరా శరణు శరణు
మహాకవి యగు ధూర్జటి కవి కృష్ణ దేవరాయల ఆస్థానం లో ఉన్నటువంటి అష్ట దిగ్గజ కవుల్లో ఒకడు ఆయన స్వతాహాగా అద్భుతమైన తెలుగు సాహిత్య ప్రతిభ కలవాడు కాబట్టే రాయల ఆస్థానం లో చోటు దొరికింది. ఆయన శ్రీ కాళహస్తి ఈశ్వరుని పైన శతకం కూడా రచన చేశాడు.
ఈ శతకంలో ప్రతి పద్యం అద్భుతమైన భక్తి భావనని కలిగి ఉంటుంది. అలాంటి పద్యాలలో ఒకటి ఈకింద భావ సహితంగా ఇవ్వబడింది. ఇది పద్యం వలె కాక ఒక వేడుకోలుగా తోస్తుంది గమనించి చూస్తే
రాజుల్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు సం
భోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులాత్మ వ్యధా
బీజంబుల్, తదపేక్ష చాలుఁ, పరితృప్తింబొందితిన్, జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము, దయతో శ్రీకాళహస్తీశ్వరా!
ఈశ్వరా! రాజులు ఐశ్వర్యముతో మదించినవారు. వారి సేవ నరకము వంటిది. వారు దయతో ఇచ్చిన పరిచారికలు, పల్లకీలు, గుర్రాలు, భూషణములు, మొదలగునవి, సంసార బంధములు పెంచి, దుఃఖమును కలిగిస్తాయి. వీటన్నింటినీ అనుభవించి, సంతృప్తి పడ్డాను. ఇంక వాటిపై వ్యామోహము చాలు. జ్ఞాన సంపదను, దానివల్ల కలిగే మోక్షమును, నాకు ప్రసాదించుము.
శంభో మహాదేవ