అక్కడ మగవాళ్లకే ఎంట్రీ, ఆడవాళ్లకు నో ఎంట్రీ !

మన భారతదేశంలో హిందూ సాంప్రదాయాలు ఎంతో పక్కాగా అమలుచేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఆచారాలు కచ్చితంగా పాటించాల్సిందే, ఆలయాల ను సందర్శించే మాటకువస్తే మగవారి కంటే స్త్రీలకు ఉండే నిబంధనలు కాస్త కఠినంగా ఉంటాయి. దేవుళ్ళకు పూజ చేయడం దగ్గరి నుంచి ఆలయానికి వెళ్లే విషయంలోనూ మహిళలకు రూల్స్ అడ్డుపడుతూనే ఉంటాయి.
ఇప్పటికే శబరిమల , శనిసింగాపూర్ మహిళల ఆలయ ప్రవేశ విషయంలో ఎన్నో దుమారాల చెలరేగాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ఆలయమే ఒకటి ఉందన్న విషయం చాలామందికి తెలీదు, ఈ గుడి యొక్క ఆచారాలు కూడా కొంత విచిత్రంగా ఉన్నాయి.
వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా, పుల్లంపేట మండల పరిదిలోని , తిప్పాయపల్లిలోని ‘సంజీవరాయ స్వామి’ ఆలయం ఒకటి ఉంది. అంటే అంజనేయస్వామి గుడి అన్న మాట . మరి ఈ గుడి నియమాలు ఏంటంటే , గుళ్ళోకి మహిళలకు ప్రవేశం లేదు. ఆలయంలో అన్ని పూజలు, ఇతర కార్యక్రమాలన్ని పురుషులే చేయాల్సిఉంటుంది. ప్రతి సంవత్సరం చేసే పొంగళ్ల పూజను కూడా మగవాళ్లే నిర్వహించారు. ఇక్కడ ఎంతో నిష్టతో హనుమంతుడికి పూజలు నిర్వహిస్తారు.

ఇక ఈ గుడి చరిత్ర విషయానికి వస్తే , రామునికి,రావణునికి మధ్య జరిగిన యుద్ధం లో గాయపడ్డ లక్ష్మణుడిని రక్షించేందుకు ఆంజనేయుడు సంజీవనీ పర్వతం తీసుకెళ్తున్న వేల , ఈ ప్రాంతంలోనే ఆగి సూర్యనమస్కారం చేసినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఇక్కడ ఆంజనేయుడ్ని సంజీవరాయ స్వామిగా కొలుస్తారు. ఇక్కడ ఆలయం కట్టినప్పటినుండి, ఇప్పడివరకు మహిళలకు ప్రవేశం లేదు. తిప్పాయపల్లె చుట్టుపక్కల ప్రజలను అనారోగ్యాల నుంచి కాపాడుతాడని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.